ఘనంగా కోండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
- kranthi kumar
- Sep 27, 2024
- 1 min read
కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలకు రవీంద్రభారతీలో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొని , కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మూడు తరాల ఉద్యమ నేత, తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, తెలంగాణ కొరకు మంత్రి పదవిని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పట్టుదలకు, నిజాయితీకి మారుపేరని, తాను నమ్ముకున్న సిద్దాంతాల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహా పురుషుడని ఆయన కొనియడారు.
బడుగు బలహీనవర్గాల కోసం, నేతన్న సంక్షేమం నిరంతర తపించారని తెలిపారు. మలిదశ ఉద్యమంలో హుస్సేన్ సాగర్ సమీపాన ఉన్న జలదృశ్యంలోని తన ఉద్యమ వేదికగా మార్చారని,
గడ్డ కట్టే చలిలో డిల్లీలో నిరాహార దీక్ష చేసి ఉద్యమకారుల్లో చైతన్యనింపారని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులు పోరాటం వల్లే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని వెల్లడించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గత పదేండ్లలో ప్రజల అకాంక్షాలకు అనుగుణంగా పాలన జరగలేదని, ప్రభుత్వ భూములను తాకట్టు వేల కోట్ల ధనాన్ని లూటీ చేశారని చెప్పారు.
సీయం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తుందని అన్నారు. కొత్తగా ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి (IIHT) కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, టీజీఎండీసీ చైర్మన్ అనిల్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, బీసీ కమిషన్ చైర్మన్ జీ. నిరంజన్, కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ కమీషనర్ బాల మాయాదేవి, భాషా , సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, అఖిల బారత పద్మశాలి అధ్యక్షులు కొదగడ్ల స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Comments