నిరుపేదల కడుపు నింపడానికి సన్న బియ్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు
- kranthi kumar
- Apr 5
- 1 min read
సన్న బువ్వతో పేదోడి కడుపు నింపాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పానగల్ మండలంలోని రేమద్దుల,కిష్టాపూర్, గోపాల్ పూర్, అన్నారం గ్రామాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే, అంతేకాకుండా సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చి రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంలో ప్రభుత్వం ముందు వరుసలో నిలిచిందని తెలిపారు.
వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న బియ్యం దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని పేద, మధ్యతరగతి వర్గాలు పెద్ద సంఖ్యలో రేషన్ దుకాణాల నుంచి తీసుకున్న బియ్యాన్ని ఆ సమీపంలోనే దళారులకు విక్రయించడం, లేదంటే డీలర్ల నుంచి అసలు బియ్యం తీసుకోకుండా అతను ఇచ్చిన మొత్తం తీసుకుని వెళ్లడం జరిగేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ...
ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని చెప్పారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ కింద పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్, రెండు పంటలకు ఏడాదికి రూ. 12,000 రైతు భరోసా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, తదితర ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియమాకాలను క్రమం తప్పకుండా చేపడుతున్నామని పేర్కొన్నారు.
రుణమాఫీ కానీ వారు, 200 వ యూనిట్ల వరకు ఉచిత కరెంట్ , రూ. 500 కే సిలిండర్ రాయితీ రాని అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అధికారులకు లంచం ఇవ్వవద్దని కోరారు.

Comments