నార్లాపూర్ జలాశయ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి
- kranthi kumar
- Sep 13, 2024
- 2 min read

సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
సానుకూలంగా స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 9: పాలమూర్ రంగా రెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన.. నార్లపూర్ రిజర్వాయర్ లో ముంపుకు గురై, భూమి ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను పరిష్కారించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఎర్రమంజిల్ లోని జలసౌధలో నిర్వాసితులతో.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వారి సమస్యలను జూపల్లి వివరించారు.
బోడబండా తండా గ్రామపంచాయతీ పరిధిలోని సున్నపు తండా, దూల్యనాయక్ తండా, అంజనగిరి తండా , వడ్డె గుడిసెలు గ్రామాలకు చెందిన 117 మంది నిర్వాసితులకు జీవో నం. 123 ప్రకారం కాకుండా జీవో నం.120 ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. వేర్వేరు జీవోలతో పరిహారం చెల్లించడం నిర్వాసితులు నష్టపోతున్నారని అన్నారు.
ప్రభుత్వ, అటవీ భూముల్లో ఉన్న ఎల్లూర్, నార్లాపూర్ గ్రామాల నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ వారికి పరిహారం చెల్లించలేదని, పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నార్లాపూర్ జలాశయ నిర్వాసితులకు ఎల్లూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 622, 623లో ఆర్ అండ్ ప్యాకేజీలో భాగంగా కాలనీ ఏర్పాటు చేయడానికి గతంలో నోటిఫై చేయగా, గత ప్రభుత్వం వీరికి సర్వే నంబర్ 371- 376కి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కాలనీని మార్చారని, అయితే దీన్ని గతంలో మాదిరిగానే సర్వే నంబర్ 622, 623 కు ఆర్ అండ్ ప్యాకేజీని మార్చాలని కోరారు.
బోడబండా తండాలో ఇంకా మిగిలిన ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించి, ఇతర నిర్వాసితుల మాదిరిగానే వీరికి పునరావాస ప్యాకేజీని వర్తింపజేయాలన్నారు.
బొల్లారం అటవీ భూముల్లో నివాసం ఉంటున్న శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వాసితులకు అక్కడే ఇళ్ల స్థలాల హక్కులు కల్పించాలని, అటవీ శాఖకు ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమి కేటాయించేలా చూడాలని కోరారు.
ముంపు గ్రామాల ప్రజలు ఆధైర్యపడొద్దని, నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయాన్ని త్వరగా అందించే విధంగా తన వంతు కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని.. నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ పాటిల్ ప్రశాంత్ జీవన్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన వారిలో మాజీ జడ్పీటీసీ హనుమంతు నాయక్, మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ రఘపతిరావు, మాజీ ఎంపీటీసీ రామన్ గౌడ్, మాజీ సర్పంచ్ రాము నాయక్, మాజీ ఎంపీటీసీ నక్క వెంకటస్వామి, బాలయ్య, స్వామి, వెంకటస్వామి, బిచ్చిరెడ్డి, సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు.
Comments